Telugu Rakshabandhan Sandesh 2020
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
రక్షాబంధన్ పండుగ సందేశము. ఆగస్టు 3, 2020
ఆత్మీయ హిందూ బంధువులారా!
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి సంవత్సరము జరుపుకొనే ఆరు ఉత్సవాలలో రక్షాబంధన్ ఒకటి. శ్రావణ పూర్ణిమ నాడు ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము. సాధారణ భారతీయ సమాజంలో ఈ ఉత్సవం కుటుంబానికి పరిమితమై ఉంటుంది. సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతకు, అనురాగానికి ప్రతీక ఈ పండుగ. సోదరిపట్ల సోదరుని ప్రేమ, కర్తవ్య దీక్షకి ప్రతీకగా రక్షాబంధనం జరుగుతూ ఉంటుంది. సంఘంలో ఈ సందేశాన్ని కేవలం కుటుంబానికే కాక మొత్తం సమాజానికి వర్తించే విధంగా ఆలోచన చేయడం జరిగింది. “ఈ సమాజమంతా ఒకటే కుటుంబం. ఇక్కడి ప్రజలందరూ సోదరుల వలె కలిసి జీవిస్తూ సమాజము మరియు ధర్మము పట్ల కర్తవ్యనిష్ఠ కలిగి ఉండాలనే” సందేశాన్ని ఈ ఉత్సవం ద్వారా సంఘం సమాజానికి అందచేస్తోంది. మన మధ్య అనైక్యత, స్వార్థభావనల కారణంగా 1200 సంవత్సరాలు మనం విదేశీయుల పాలనలో ఉన్నాము. ఈ కాలఖండంలో మన సమాజం ఎన్నో కష్టనష్టాలను చూసింది. మన దేవాలయాలను, శ్రద్ధా కేంద్రాలను విదేశీ ఆక్రమణ దారులు ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుని జన్మస్థానంలో నిర్మించిన భవ్యమైన రామమందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ మసీద్ ని కట్టడం జరిగింది. రామ జన్మస్థానాన్ని తిరిగి పొందడటానికి 500 సంవత్సరాలకు పైగా సంఘర్షణ జరిగింది. ఈ పోరాటంలో 3 లక్షలకు పైగా హిందువులు ప్రాణాలను అర్పించారు. 1989వ సంవత్సరం నుండి సాధుసంతుల మార్గదర్శనములో రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచండమైన ఉద్యమాన్ని నిర్వహించింది. బాబ్రీ కట్టడం 1992లో తొలగించబడినప్పటికీ రామాలయ నిర్మాణం కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. జాగృతమైన హిందూ సమాజం మరియు కేంద్ర ప్రభుత్వము యొక్కకర్తవ్యనిష్ఠ కారణంగా ఎట్టకేలకు సుప్రీంకోర్టు రామాలయ నిర్మాణానికి అనుమతినిచ్చింది. దీనివలన భవ్య రామమందిర నిర్మాణమనే కల సాకారమౌతోంది. అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణము హిందూ సమాజము యొక్క స్వాభిమానమునకు ప్రతీక. యావత్తు హిందూ సమాజము గర్వించదగ్గ క్షణాలివి.
1947లో మన దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటికి అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని లోపాలు, మన సమాజంలో అనైక్యత, ఉదాసీనత మొదలగు బలహీనతల వల్ల మనం ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోయాము. దీనివలన మన పొరుగు దేశమైన చైనా మన భూభాగాలను ఆక్రమించడమే కాక మన ఆర్థిక వ్యవస్థని కూల్చివేసే ప్రయత్నం చేసింది. అనేక వస్తువులపై మనం కేవలం చైనా మీద ఆధారపడుతున్నాం. అయితే ఇటీవల మన కేంద్ర ప్రభుత్వ ధృఢ వైఖరి కారణంగా చైనా విస్తరణ కాంక్షకు అడ్డుపడే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ పరీక్షా సమయంలో యావత్ సమాజము ఒకటై నిలిచి, చైనా వస్తువులను వాడకపోవటం, స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించటం మొదలైన విషయాలలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మన ప్రధాని శ్రీనరేంద్రమోదీ ఆత్మనిర్భర భారత్ నిర్మాణాన్ని కోరుతూ ప్రజలంతా Local మన Vocal కావాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ఉత్పత్తి చేసే వస్తువులను కొనడం, ప్రోత్సహించడం వలన మన దేశం ఆర్థికంగా పురోగతి చెందటమే కాకుండా అనేకమంది స్థానిక ఉత్పత్తి దారుల జీవితాలు మెరుగుపడతాయి. స్వయం సేవక కుటుంబాలు స్వయంగా స్వదేశీ భావనను పాటిస్తూ సమాజంలో విస్తృతంగా దీనిని ప్రచారం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆపేక్షిస్తోంది. గత 6 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భూమిపై మానవాళి మనుగడను అస్తవ్యస్తం చేస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న అమెరికా, యూరప్ దేశాలు కూడా ఏమీ చేయలేక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అత్యధిక జనాభా, పరిమితమైన ఆర్థిక వనరులు, సాంకేతికత ఉన్న భారత్ లో మరణాలు చాలా తక్కువగా ఉండటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న హిందూ కుటుంబ వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు దీనికి కారణం అని నిస్సందేహముగా చెప్పవచ్చు. హిందూ జీవన పద్ధతి, యోగ, ఆయుర్వేదము, ఆహారపు అలవాట్ల కారణంగానే మన దేశం కరోనాని సమర్థంగా ఎదుర్కోంటోంది అని అనేక అధ్యయనాలు చెపుతున్నాయి. మన ఋషులు, పూర్వీకులు అందించిన జీవన పద్ధతి, కుటుంబ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ కేవలం మన సమాజానికే కాకుండా సంపూర్ణ మానవ జాతి శ్రేయస్సుకు ఉపయోగపడతాయి. ఈ సంస్కృతీ సభ్యతలు, ఆహారపు అలవాట్లు, హిందూ జీవనశైలి ఆచరిస్తూ, తరువాత తరాలకి అందచేసే బాధ్యత మన అందరిపైనా ఉంది. గడచిన 95 సంవత్సరాలుగా సంఘం హిందూ సమాజ సంఘటన ద్వారా దేశము యొక్క పునర్వైభవ స్థాపన అనే లక్ష్యం సాధించడంకోసం పని చేస్తోంది. ప్రతి సంవత్సరము రక్షాబంధన్ సమయంలో విస్తృతంగా సమాజం లోకి వెళ్ళి అందరినీ కలిసి “నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనం ఇద్దరం ఈ దేశానికి సమాజానికి రక్ష"గా నిలవాలనే సందేశం అందిస్తున్నది. ఈ ఆలోచనలను వేగంగా అన్ని కుటుంబాలలో, సమాజమంతా విస్తరింపచేయాలి. అప్పుడే ఈ దేశం శక్తివంతమౌతుంది. ప్రపంచంలో శాంతి స్థాపింపబడుతుంది.
జై హింద్. జై భారత్ మాత.
సూచన : కార్యక్రమంలో చివరగా కుటుంబ సభ్యులు అందరూ పరస్పరం రక్షలు కట్టుకుంటూ క్రింది శ్లోకాన్ని పఠించగలరు.
శ్లోకము:-
యేనబద్దో బలీరాజా - దానవేంద్రో మహాబలః | తేనత్వామభి బధ్నామి - రక్షే మాచల మాచల ||
భావము :- ఏ రక్షా కంకణముతో మహాబలశాలియైన దానవరాజు కట్టుబడినాడో, ఆ రక్షా కంకణముతో నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్షా కంకణమా నీవు చలింపకు. (నీవు (రక్ష) నా ఆధీనంలో ఉన్నావని భావము) II